25, డిసెంబర్ 2011, ఆదివారం

రాజమండ్రి ఖైదీల స్వామి మాలధారణ


క్షణికావేశంతో చేసిన తప్పుకు విలువైన జీవితం కొంతకాలం నాలుగు గోడల మధ్య గడపాల్సిన దుస్థితి వారిది. ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. తమలో పరివర్తన వచ్చినా శిక్షాకాలం పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండి తీరాలి. అయితే జైల్లో ఉంటే మంచీ చెడూ ఉండవా.. ఏ ముచ్చటకూ నోచుకోరా.. ఏ కార్యక్రమం చేయాలన్నా వీలుపడదా.. ఇవే బయట ఉన్నవారిని తొలిచే ప్రశ్నలు.. కానీ రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న భక్తులకు తమ ఇష్టదైవాన్ని కొలుచుకునే అవకాశం కల్పించారు అధికారులు. ఈ మధ్య సత్యదేవుని వ్రతం జరిపించిన అధికారులే ఇప్పుడు ఖైదీలకు వెంకటేశ్వర స్వామి మాల ధరించేందుకు అనుమతి ఇచ్చారు...
కారాగారవాసమంటే కష్టకాలమనుకుంటారు.. వాస్తవానికి ఇది కష్టకాలమే.. కుటుంబానికి, అయిన వారికి దూరమై... కొత్త వ్యక్తులతో సర్ధుబాటు చేసుకుంటూ.. ఇష్టమున్నా లేకున్నా చెప్పిన పని చేసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి.. విలువైన జీవితకాలాన్ని కొంతకాలం పరాధీనం చేయాలి. ఈ శిక్షాకాలం ఖైదీల్లో పరివర్తన తెచ్చి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకే అని అధికారులు చెబుతారు. అయితే ఇది ఎంత వరకు అమలవుతుందనేది చెప్పలేకపోయినా..రాజమండ్రి జైలు అధికారులు మాత్రం ఖైదీల్లో మానసిక పరివర్తనలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు కనిపిస్తోంది.
గత కొన్ని రోజుల క్రితం ఖైదీలకు సత్యదేవుడి వ్రతం చేసుకునే అవకాశం కల్పించిన అధికారులు.. తాజాగా ఖైదీలకు శ్రీ వెంకటేశ్వరస్వామి మాలను ధరించి శ్రీవారిని పూజించే అవకాశం కల్పించారు. ఈ మాల ధరించిన భక్తులు భక్తి భావంతో మెలగడంతో.. జైలు పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్వామి మాల వేసుకున్న ఖైదీలు 90 రోజుల పాటు నిష్టతో ఈ దీక్ష పూర్తి చేస్తారు. జైల్లో తాము నిర్మించుకున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దీక్ష చేస్తున్న భక్తులంతా స్వామి వారికి హారతి ఇచ్చాక సామూహికంగా భోజనాలు చేస్తారు. ధనుర్మాసం చివరి వరకు నిర్వహించే ఈ పూజల్లో ఖైదీ భక్తులు అత్యంత నిష్టగా ఉంటారు. తమలో పరివర్తన తీసుకొచ్చి తమ వారికి దగ్గర చేయవలసిందిగా వేడుకొంటారు.
రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీలు ఆధ్యాత్మిక చింతనకు మళ్లడానికి,, స్వామి మాలను ధరించడానికి చిన్నజీయర్ స్వామీజీ సహకరించారని ఖైదీలు చెబుతున్నారు. చెరసాలను ఆలయంగా మార్చుకొని ఆధ్యాత్మిక వాతావరణం నింపిన ఖైదీలను, వారికి సహకరిస్తున్న అధికారులను అభినందించాల్సిందే..